మాజీ సిఎం కేసీఆర్ శాసనసభ సమావేశాలకు మొహం చాటేసినప్పుడు ఎందుకు రావడం లేదని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నిలదీసేవారు. శాసనసభ సమావేశాలకు వచ్చి చర్చలలో పాల్గొనాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా? అని ప్రశ్నించేవారు.
ఇప్పుడు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఓ పెద్ద కట్టు కధ అంటూ తీసిపడేశారు కూడా. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు కూడా. కనుక సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా కేసీఆర్‌ని ధీటుగా ఎదుర్కోవడం ఖాయం.
అయితే మొదట శాసనసభ సమావేశాలకి మొహం చాటేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? అనే చర్చ మొదలైంది. కేసీఆర్ ఇన్ని రోజులు ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకుండా ఉండిపోవడం వలననే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ మనుగడ కష్టమని భావించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారని, కేసీఆర్ ఈవిషయం గ్రహించి ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తమ కళ్ళ ఎదుట శాసనసభలో కనబడుతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ధైర్యం కలిగి పార్టీని అంటిపెట్టుకొని ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ శాసనసభకు రాకపోతే ఎందుకు రాలేదనే ప్రశ్నలు వినపడతాయి. వస్తే ఈవిదంగా కారణాలు వెతుకుతుండటం ఆశ్చర్యంగా ఉంది కదా?