బిఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన... ఇప్పుడు ఎందుకో?

July 26, 2024


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించేందుకు బయలుదేరారు. వారందరూ నిన్న సాయంత్రం కరీంనగర్‌లోని లోయర్ మానేరు రిజర్వాయర్‌ని సందర్శించారు.

తర్వాత రాత్రి రామగుండంలో బస చేసి ఈరోజు ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుని పరిశీలించారు. తర్వాత మేడిగడ్డ బ్యారేజిని సందర్శిస్తారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతారు. ఈరోజు సాయంత్రానికి అందరూ మళ్ళీ హైదరాబాద్‌ చేరుకుంటారు. 

శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, వాటిపై జరుపుతున్న కమీషన్‌ విచారణ గురించి ప్రస్తావిస్తూ బిఆర్ఎస్ పార్టీని ఎండగట్టబోతోంది. బహుశః అందుకే కేసీఆర్‌ ఆదేశం మేరకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేసిన్నట్లున్నారు.

కనుక శాసనసభ, మండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిగితే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌కు ధీటుగా బదులివ్వగలరు.

కానీ మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు క్రుంగినందున బ్యారేజీ మొత్తం దెబ్బతినకుండా కాపాడుకునేందుకు అన్ని గేట్లు ఎత్తేసి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి వలననే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్‌ వాదిస్తోంది. కనుక శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ చాలా వాడివేడిగా సాగవచ్చు. 


Related Post