ఈరోజు శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలలో మాజీ ఆర్ధికమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అంతా తప్పుల తడక అని లేని, రాని ఆదాయం చూపిస్తూ వాటిని అభివృద్ధి పనులకు, సంక్షేమ పధకాలకు కేటాయిస్తున్నట్లు చూపారంటూ ఎద్దేవా చేశారు.
ఆయనకు ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా బదులిచ్చారు.
సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “హరీష్ రావు అప్పుల లెక్కలు బాగానే చెపుతున్నారు. కానీ వారి ప్రభుత్వం అమ్మిన ఆస్తుల లెక్కలు చెప్పడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఆస్తులు అమ్ముకున్నప్పుడు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి కదా? కానీ పదేళ్ళలో లక్షల కోట్లు అప్పులు చేశారు. వేలకోట్ల విలువగల భూములు కూడా అమ్ముకున్నారు. కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయనే లేదు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా ఎలా ఉందో పదేళ్ళ కేసీఆర్ పాలన తర్వాత నేటికీ అలాగే ఉంది. ఆ ప్రాంతం అంతా బీడువారి ఎడారిలా మారిపోయింది.
మీరు ఎంతో గొప్పగా చెప్పుకునే బతుకమ్మ చీరల పంపిణీ, గొర్రెల పంపిణ, కేసీఆర్ కిట్స్ పంపిణీలో ఎన్ని వందల కోట్లు అవినీతి, అక్రమాలు జరిగాయో మీకు తెలుసు. గొర్రెల పంపిణీ పధకాన్ని పైపైనే పరిశీలిస్తే రూ.700 కోట్లకు అవినీతికి పాల్పడిన్నట్లు తేలింది. ఇంకా లోతుగా వెళ్ళి విచారణ జరిపితే ఇంకెంత బొక్కారో బయటపడుతుంది. ఈ మూడు పధకాలపై విచారణ జరిపించమంటారా?మీరు సిద్దమే అంటే విచారణకు ఆదేశిస్తాను,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరారు.