నెట్‌ఫ్లిక్స్‌లో రాజమౌళిపై డాక్యుమెంటరీ ఫిల్మ్

July 06, 2024
img

తెలుగు సినీ దర్శకులలో రాజమౌళి బాహుబలి అని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే కాకుండా భారత్‌కు ఆస్కార్ అవార్డ్ కూడా సాధించిపెట్టారు. కనుక నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో ఆయనపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మింపజేసింది. 

ఒక మనిషి వరుసపెట్టి ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఎలా తీయగలుగుతున్నారు?ఆయన ఆశయాలకు అంతే లేదా? అసలు తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఎంత కష్ట పడ్డారు? ఎన్నేళ్ళు ఏవిదంగా శ్రమించారు? అసలు ఆయన అంతిమ లక్ష్యం ఏమిటి? వంటి అంశాలను తెలియజేస్తూ ఈ ‘మోడ్రన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ ఫిల్మ్ తయారు చేయించింది. 

దీనిని ఆగస్ట్ 2 నుంచి ప్రసారం చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లో రాజమౌళితో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఆయన గురించి సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లో చూపించబోతోంది.

ఇదివరకు చాలా మంది దర్శకులు, నటీ నటులపై ఈవిదంగా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ బయో పిక్స్ వచ్చాయి. కానీ వర్తమాన దర్శకులలో తొలిసారిగా రాజమౌళి మీదే డాక్యుమెంటరీ ఫిల్మ్ వస్తోంది. ఇది తెలుగు సినీ పరిశ్రమకి, తెలుగు ప్రజలందరికీ గర్వకారణమే కదా?

Related Post