జీవన్ రెడ్డికి టిఎస్‌ఆర్టీసీ షాక్: షాపింగ్ మాల్‌ స్వాధీనం!

May 17, 2024


img

బిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టిఎస్‌ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులోని టిఎస్‌ఆర్టీసీ స్థలం లీజుకి తీసుకొని దానిలో నిర్మించుకున్న జీవన్ రెడ్డి షాపింగ్ మాల్‌ని టిఎస్‌ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో జీవన్ రెడ్డి ఆ స్థలాన్ని టిఎస్‌ఆర్టీసీ నుంచి లీజుకి తీసుకుని తన పేరిట షాపింగ్ మాల్‌ నిర్మించుకున్నారు. కానీ టిఎస్‌ఆర్టీసీకి ఆయన చెల్లించాల్సిన రూ.7.23 కోట్ల బకాయిలు చెల్లించలేదు. 

ఇంతకాలం రాష్ట్రంలో బిఆర్ఎస్‌ పార్టీయే అధికారంలో ఉండేది కనుక టిఎస్‌ఆర్టీసీ అధికారులు బకాయిల కోసం ఆయనను గట్టిగా అడగలేకపోయేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో వారు ఆయనకు నోటీస్ ఇచ్చి తక్షణమే బకాయిలు చెల్లించాలని లేకుంటే షాపింగ్ మాల్‌ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. 

కానీ జీవన్ రెడ్డి తాను బకాయిలు ఎప్పుడో చెల్లించేశానని, టిఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రాజ్యసభ సీటు కోసం ఆశపడుతూ సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన్నట్లు ఆడుతూ కీలకమైన లోక్‌సభ ఎన్నికల సమయంలో తనను అప్రదిష్టపాలు జేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల  సంఘానికి ఆయనపై ఫిర్యాదు చేశారు కూడా. సజ్జనార్ అక్రమాలకు పాల్పడి భారీగా అక్రమాస్తులు పోగేసుకున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. 

జీవన్ రెడ్డి ఆరోపణలపై సజ్జనార్ స్పందించలేదు కానీ టిఎస్‌ఆర్టీసీ అధికారులు ఆర్మూరులో జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌ని స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే తాము షాపింగ్ మాల్‌ స్వాధీనం చేసుకున్నామని వారు చెప్పారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఏవిదంగా స్పందిస్తారో? 


Related Post