తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ సిఎం కేసీఆర్ చాలా చులకనగా మాట్లాడారు. అదో ఈస్టమన్ కలర్ సినిమా, కట్టుకధ అంటూ తీసిపడేశారు. కానీ బడ్జెట్ కేటాయింపులను నిశితంగా గమనిస్తే సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లు వాస్తవ ఆదాయం, అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగానే చేసిన్నట్లు అర్ధమవుతుంది.
బడ్జెట్‌లో రైతుబంధు, రైతు భరోసా, దళిత బంధు వంటి పధకాలకు నిధులు కేటాయించలేదని కేసీఆర్ ఆక్షేపించారు. కానీ వ్యవసాయ పద్దు కింద రూ.72,659 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు కేటాయించింది.
తాను ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పధకానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. దానిలో దాదాపు రూ.770 కోట్ల మేర అవినీతి జరిగిందని ఈడీ చెపుతోంది. అంటే ఆ పధకం అర్హులైన లబ్ధిదారులకు కాక ఇతరుల జేబులు నింపుకునేందుకు ఉపయోగపడిందని అర్దమవుతోంది.
కనుక ఆ పధకాన్ని యధాతధంగా కొనసాగించాలని కేసీఆర్ కోరుకోవడం అంటే అవినీతి, అక్రమాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లే ఉంది. అయినా బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో గెలిచేందుకు ప్రవేశపెట్టిన పధకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని నియమం ఏమీ లేదు కదా?కానీ కొనసాగించకపోతే తప్పు అన్నట్లు కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నా నిరుద్యోగభృతి వంటి అనేక హామీలు అమలు చేయకుండా తప్పించుకున్నారు. ప్రజలు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని తిరస్కరించడానికి హామీలు అమలుచేయకపోవడం కూడా ఓ కారణమే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలుచేస్తోంది.
గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలకే వేల కోట్లు చెల్లించాల్సివస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు, సంక్షేమ పధకాలకు ఉన్నంతలో బాగానే నిధులు కేటాయించిందని బడ్జెట్ చూస్తే అర్దమవుతుంది.
కానీ కేసీఆర్ బడ్జెట్ వివరాలు చూడకుండానే అలవాటుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. పైగా శాసనసభ సమావేశాలలో బడ్జెట్‌ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు కూడా. ఈవిదంగా అహంభావం ప్రదర్శించడం వలననే బిఆర్ఎస్ పార్టీ పతనం అవుతోందని కేసీఆర్ ఇంకా ఆగ్రహించిన్నట్లు లేదని సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట అక్షరాల నిజం.