శనివారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అందుకే అధికారిక ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. కనుక ఈరోజు సమావేశం జరుగుతుందో లేదో ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది.
ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ళు, ఆగస్ట్ 15లోగా రైతులకు పంట రుణాల మాఫీ, వీటి కొరకు నిధుల సమీకరణ మార్గాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15లోగా పంట రుణాలు మాఫీ చేస్తానని పదేపదే హామీ ఇచ్చారు. అందుకు దేవుళ్లపై ఓట్లు కూడా వేశారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయం లేనందున రేవంత్ రెడ్డి ఈ హామీతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారని కేస్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరూ ఈ హామీ అమలుపై సవాళ్ళు, ప్రతీ సవాళ్ళు కూడా విసురుకున్నారు.
కనుక ఈ హామీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో వెనక్కు తగ్గలేని పరిస్థితి ఏర్పడింది. కనుక ఒకవేళ నేడు మంత్రివర్గ సమావేశం జరిగితే దానిలో ఈ హామీ అమలు కోసం ఆదాయ మార్గాలు, నిధులు సమీకరణ గురించి చర్చించనున్నారు.