ప్రముఖ తెలుగు సినీ నటుడు జూ.ఎన్టీఆర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆయన గీతాలక్ష్మి అనే మహిళ చేతిలో మోసపోయారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లో ఓ ఇంటి స్థలాన్ని జూ.ఎన్టీఆర్ 2003లో కొనుగోలు చేశారు.
ఆమె ఆ స్థలాన్ని చెన్నైలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి కొంత రుణం తీసుకుంది. స్థలం కొనుగోలు సమయంలో జూ.ఎన్టీఆర్ ఆ అప్పును పూర్తిగా తీర్చేసి బ్యాంకు నుంచి డాక్యుమెంట్లు తీసుకొని ఆ స్థలాన్ని తన పేరుపై రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆ స్థలం జూ.ఎన్టీఆర్ ఆధీనంలోనే ఉంది.
అయితే గీతాలక్ష్మి ఆ స్థలం డాక్యుమెంట్లకు నకిలీలు సృష్టించి మరో 5 బ్యాంకుల నుంచి కూడా రుణాలు తీసుకుంది. కానీ ఆ విషయం జూ.ఎన్టీఆర్‌కు చెపితే ఆయన స్థలం కొనరు కనుక ఆ విషయం దాచిపెట్టి ఆయనకు అంటగట్టేసింది.
ఆమె ఆ స్థలంపై తీసుకున్న అప్పు, దాని వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకులకు అనుమానం వచ్చి విచారణ జరుపగా ఆ స్థలాన్ని జూ.ఎన్టీఆర్ కొనుగోలు చేసిన్నట్లు గ్రహించి, ఆయనకు బాకీ చెల్లించమని నోటీసులు పంపడం ప్రారంభించాయి.
దీంతో షాక్ అయిన జూ.ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారు. ఆ స్థలంపై ఆమె 1996లోనే తమ వద్ద రుణాలు తీసుకున్నారని, కనుక జూ.ఎన్టీఆర్ నుంచి ఆ బకాయిలు వసూలు చేసుకునేందుకు సిద్దమై నోటీసులు ఇచ్చాయి. జూ.ఎన్టీఆర్ వీటిని రుణ వసూళ్ల ట్రిబ్యూనల్లో సవాలు చేయగా అది కూడా సదరు బ్యాంకులకు ఆయన నుంచి బకాయిలు వసూలు చేసుకునే హక్కు కలిగి ఉన్నాయని తీర్పు చెప్పింది.
ఆ తీర్పునే జూ.ఎన్టీఆర్ హైకోర్టు సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ట్రిబ్యూనల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, స్థలంపై తన యాజమాన్య హక్కులను నిర్ధారించాలని జూ.ఎన్టీఆర్ హైకోర్టుని అభ్యర్ధించారు. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 6న హైకోర్టు చేపట్టనుంది.