తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తూ ‘టిఎస్’ అక్షరాలను ఖరారు చేసింది. అయితే అది తెలంగాణ రాష్ట్రాన్ని కాక ‘టిఆర్ఎస్’ పార్టీని సూచిస్తున్నట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ అప్పుడే అభ్యంతరం చెప్పింది. తాము అధికారంలోకి వస్తే టిఎస్‌ని టిజి (తెలంగాణ గవర్నమెంట్)గా మారుస్తామని రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కనుక ‘టిఎస్’ను ‘టిజి’గా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దాని ప్రకారం ఇక నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు, సర్క్యులర్స్, నోటిఫికేషన్స్, అధికార పత్రాలు, వాహనాలు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా ప్రతీ వాటిలో ‘టిఎస్’కు బదులు ‘టిజి’ అని పేర్కొనవలసి ఉంటుంది.
హార్డ్ కాపీలతో పాటు కంప్యూటర్లలో సాఫ్ట్ కాపీలు, వివిద శాఖల వెబ్‌సైట్స్, కార్యాలయాల బోర్డులు అన్నిటినీ కూడా మార్చాల్సి ఉంటుంది. ఇక నుంచి రాష్ట్రంలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టిజితోనే నంబర్లు కేటాయించాల్సి ఉంటుంది. పాత వాహనాలకు ఎటువంటి మార్పు ఉండదు.