తెలుగు టీవీ సీరియల్స్ నటుడు చంద్రకాంత్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. మనస్పర్ధల కారణంగా ఆయన గత కొంత కాలంగా భార్యా పిల్లలకు దూరంగా హైదరాబాద్‌లో మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ రోడ్ నంబర్ 20లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ప్రస్తుతం ‘త్రినయిని’తో సహ పలు తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం త్రినయిని సీరియల్లో నటిస్తున్న పవిత్ర జయరాంతో కలిసి బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ తిరిగి వస్తుండగా దారిలో మహబూబ్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దానిలో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోగా, చంద్రకాంత్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
అప్పటి నుంచి మానసికంగా మరింత క్రుంగిపోయారని చంద్రకాంత్ స్నేహితులు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం తాము ఫోన్ చేసిన చంద్రకాంత్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఆయన ఇంటికి వెళ్ళి చూడగా ఫ్యానుకి ఉరి వేసుకొని చనిపోయి కనబడ్డారని తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని చంద్రకాంత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. మానసిక ఒత్తిడి వలననే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు చెప్పారు.