తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లకు 10-12 సీట్లు ఖచ్చితంగా మేమే గెలుచుకొంటామని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం.
పదేళ్ళ మోడీ పాలనతో, నాలుగు నెలల రేవంత్ రెడ్డి పాలనతో విసుగెత్తిపోయున్న తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి 12 కంటే ఎక్కువ సీట్లే ఇవ్వబోతున్నారని కేసీఆర్ చెపుతున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని కేసీఆర్ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ చెప్పుకుంటున్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిశబ్ధ ఓటింగ్ జరిగిందని కేటీఆర్ చెపుతున్నారు.
ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు అందరూ బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు చేస్తుందంటూ ప్రచారం చేశారు. అలాగే పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకుతిన్న కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. వారి ఈ ప్రచార వ్యూహం ఫలించిన్నట్లే కనిపిస్తోంది. కనుక తమకు కనీసం 10-12 ఎంపీ సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ కానీ పక్షంలో కాంగ్రెస్ పార్టీకి 7-8, బీజేపీకి 4-5 సీట్లు రావచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే రావచ్చని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ నేతలు కూడా తమకు ఖచ్చితంగా 10-12 సీట్లు వస్తాయని నమ్మకంగా చెపుతున్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెంటినీ, వాటి అవినీతి, అసమర్దతని చూశారని, అలాగే మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం చూస్తున్నారని కనుక ఈసారి బీజేపీకి 10-12 సీట్లు ఇవ్వబోతున్నారని బండి సంజయ్ తదితరులు వాదిస్తున్నారు.
ఎవరికి వారు ఇలా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, జూన్ 4న ఫలితాలు వెలువడినప్పుడే ఎవరి వాదనలు నిజమో, ఎవరివైపు ప్రజలు ఉన్నారో తెలుస్తుంది. అంత వరకు ఎవరు ఎన్ని కధలైనా చెప్పుకోవచ్చు.