కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో భారతీయుడు-2 సినిమా అభిమానుల సహనాన్ని కూడా పరీక్షిస్తూ అనేక ఏళ్ళుగా సాగుతూనే ఉంది. ఎలాగైతేనేమి వారు సినిమా షూటింగ్ పూర్తి చేసి జూలై 12న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కానీ ఈ సినిమాకి వరుసపెట్టి ఎదురవుతున్న అవరోధాలను చూస్తున్నవారు, జూలై 12న సినిమా విడుదల అవుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అది వేరే విషయం.
అయితే భారతీయుడు-2 గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు పోక్కింది. అదే... భారతీయుడు-3! ఇది కూడా తీయాలనే ఆలోచన ఉన్నట్లు దర్శకుడు శంకర్ ఇదివరకే చెప్పారు. కానీ ఇంతకంటే మరో ముఖ్యమైన విషయం మరొకటి ఉంది.
కమల్ హాసన్-శంకర్ ఇద్దరూ కలిసి భారతీయుడు-2తో పాటే భారతీయుడు-3 సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసేశారని టాక్ వచ్చింది. అందుకే భారతీయుడు-2 షూటింగ్ ఇంత ఆలస్యమైందని సినీ వర్గాలు చెపుతున్నాయి.
భారతీయుడు-2 సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేసినందున, త్వరలోనే ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. దీని కోసం హైదరాబాద్‌లో ఓ భారీ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు-2 సినిమాలో క్లైమాక్స్ సీన్ ముగియగానే భారతీయుడు-3 ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానిలోనే భారతీయుడు-3 సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తని కమల్ హాసన్ లేదా శంకర్ లేదా నిర్మాతలు ఇంకా ధృవీకరించ వలసి ఉంది.