మాజీ సిఎం కేసీఆర్ నోటికి ఎంతటివాడైనా భయపడతాడు. ఆయన ఎదురునిలువలేడు. ప్రధాని నరేంద్రమోడీ అంతటివాడినే కేసీఆర్ పూచీకపుల్లలా తీసి పక్కన పడేసేవారు. ఇక తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలైతే ఆయన కంటికి ఆనేవారే కారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు శాసనసభ సమావేశాలకు వెళ్ళేందుకు భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మొన్న ఒక్కరోజు శాసనసభకు వచ్చి బడ్జెట్‌ని ఏకి పడేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారు. కనుక ఈరోజు తప్పకుండా శాసనసభకు వచ్చి బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటారని అందరూ అనుకున్నారు. కనుక ప్రతీ అంశంపై లోతైన అవగాహన కలిగిన కేసీఆర్‌ని కాంగ్రెస్ మంత్రులు ఏవిదంగా ఎదుర్కోగలరు?వారి తరమా? అని అందరూ అనుకుంటే, కేసీఆర్ ఈరోజు శాసనసభకు వెళ్లలేదు!
కనుక మళ్ళీ సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు హరీష్ రావుపై చెలరేగిపోయారు. కేసీఆర్‌కి దమ్ముంటే శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి నేడు సవాలు విసిరారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు తీరని అన్యాయం చేశారంటూ విమర్శలు గుప్పించారు.
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్స్ పధకాలపై అవినీతిశాఖ చేత విచారణ చేయిస్తా... మీరు సిద్దామేనా? అంటూ సిఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుకి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాలు విసిరారు.
అదే... కేసీఆర్ శాసనసభకు వచ్చి ఉండి ఉంటే, ఆయనను ఏవిదంగా ఎదుర్కోవాలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులే ఆలోచించుకోవలసి వచ్చేది. కానీ కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా వారికి మహోపకారం చేస్తూ, వారి చేతే తన పరువు తీయించుకుంటున్నారు.