ప్రముఖ కోలీవుడ్ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేస్తుంటారు కనుక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తాజాగా ఆయన ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి. కిషోర్‌తో ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు. ఈ సినిమాని హాస్య మూవీస్ నిర్మించబోతోంది.
ఇటీవలే దర్శకుడు కిషోర్, నిర్మాతతో కలిసి చెన్నై వెళ్ళి లారెన్స్ రాఘవకు కధ వినిపించగా అది ఆయనకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశారు. దాంతో వారు అప్పటికప్పుడు లారెన్స్ రాఘవకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసి ఆయనతో అగ్రిమెంట్ చేసుకున్నారు కూడా.
లారెన్స్ రాఘవ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కి తగ్గట్లుగా ఈ కధ ఉన్నందున ఆయన అయితేనే బాగుంటుందని మాట్లాడి ఒప్పించామని దర్శకుడు కిషోర్ చెప్పారు. లారెన్స్ రాఘవ తమిళనాడులో చాలా పాపులర్ హీరో కనుక ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలో కూడా తీస్తామని చెప్పారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు కిషోర్ చెప్పారు.