ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది. కానీ 300కి పైగా సీట్లు గెలుచుకుని మళ్ళీ అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఈసారి బీజేపీకి 200-220 కంటే ఎక్కువ రావని సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెపుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని, ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావలసి ఉంటుందని కేసీఆర్ చెపుతున్నారు.
ఈసారి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 330 సీట్లకు పోటీ చేస్తోంది. వాటిలో 125 గెలుచుకున్నా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని సిఎం రేవంత్ రెడ్డి చెపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 250 మంది ఎంపీల మద్దతు ఉండాలి. బీజేపీ 200-220 సీట్లు గెలుచుకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయలేనప్పుడు, కాంగ్రెస్ కేవలం 125 సీట్లతో ఎలా సాధ్యం? అంటే సాధ్యమే అంటున్నారు సిఎం రేవంత్ రెడ్డి.
ప్రముఖ జాతీయ మీడియా ‘ది ప్రింట్’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “బీజేపీని దేశంలో ప్రజలే కాదు ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి దేశంలో అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. వాటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల సదాభిప్రాయమే ఉంది.
కనుక బీజేపీ తనంతట తానుగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే, దేశంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికే మద్దతు ఇస్తాయి. కనుక కాంగ్రెస్ సొంతంగా 125 ఎంపీ సీట్లు గెలుచుకున్నా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. కానీ కాంగ్రెస్ పార్టీ అంతకంటే చాలా ఎక్కువ సీట్లే గెలుచుకోబోతోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది,” అని రేవంత్ రెడ్డి అన్నారు.