తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బిజ్, బిఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు మిగిలిన రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని తమ పార్టీ ఒక్కటే తెలంగాణ పట్ల నిబద్దతతో పనిచేస్తుందని చెప్పుకుంటాయి. ఏదో ఒకసారి రెండు సార్లు అయితే ప్రజలు నమ్ముతారు కానీ గత పదేళ్ళుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా మూడు పార్టీలు ఇదే పాట పాడుతున్నాయి.
అంటే తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం రాజకీయ జ్ఞానం లేదని అవి భావిస్తున్నాయా? అనే సందేహం కలుగుతుంది.వాటి ఉద్దేశ్యం అదే అయినప్పటికీ తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు రాజకీయ చైతన్యం కలిగినవాళ్లు, పోరాటయోధులంటూ మళ్ళీ అవే ప్రజలను మునగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తుంటాయి.
మూడు పార్టీలు అవునన్నా కాదనుకుంటున్నా తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యం కలవారే అని శాసనసభ ఎన్నికలలో నిరూపించారు. కానీ తమని ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజలు చాలా పెద్ద తప్పు చేశారన్నట్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడుతుండటం అందరూ వింటూనే ఉన్నారు.
అంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రజలు వివేకవంతులు లేకుంటే రాజకీయ ఆజ్ఞానులని అని భావిస్తున్నట్లున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఓ నిర్ణయం తీసుకుని తీర్పు చెప్పాక ఓడిపోయిన పార్టీలు కూడా దానిని గౌరవించి హుందాగా వ్యవహరిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు.
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి కనుక రాష్ట్రంలో మూడు పార్టీలు మళ్ళీ కుమ్మకు స్టోరీలు చెప్పి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి వాదనలే నిజమనుకుంటే, మూడు పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నట్లే కదా?
ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు ఈ కుమ్మక్కు కధలతో మూడు పార్టీల మద్య ఎటువంటి బంధాలు, రాజకీయాలు నడుస్తున్నాయో వాటంతట అవే బయటపెట్టుకొంటున్నాయి. దీని వలన తెలంగాణ ప్రజలకు మూడు పార్టీల గురించి మరింత లోతైన అవగాహన ఏర్పరచుకోగలుగుతున్నారు. తమను మాయమాటలతో మభ్యపెట్టాలనుకునే వారికి ఎన్నికలలో గడ్డి పెడుతున్నారు కూడా.
శాసనసభలో గడ్డి పెట్టారు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా తప్పకుండా పెడతారరని గ్రహించకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.