తెలంగాణ భూవివాదంలో ఏపీ మంత్రి కుమారుడు?

May 04, 2024


img

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ ఓ భూవివాదంలో చిక్కుకున్నారు. షాబాద్ మండలంలోని మాచన్ పల్లి గ్రామంలో సర్వే నంబర్: 442లో 31 ఎకరాల భూవివాదంలో ఆయన పేరు బయటకు వచ్చింది. 

పోచయ్య అనే వ్యక్తికి చెందిన ఈ భూమిని ఆయన కుమారులు తమ పేరు మీద బదిలీ చేయించుకోలేదు. కానీ ఆ భూమి వారి అధీనంలోనే ఉందని నిరూపిస్తూ 2018లో వారికి రైతుబంధు పధకం అందింది. ఆయన మునిమనుమలు ఆ భూమిని పంచుకోవాలనుకున్నప్పుడు, దానిలో 15 ఎకరాలు చేగూరి రమేశ్ కొనుగోలు చేశారని తెలుసుకున్నారు.

చేగూరి రమేశ్ ఆ భూమిని వేరే ఇద్దరు వ్యక్తులకు విక్రయించగా వారు ఆ భూమిని మళ్ళీ బొత్స సందీప్, ఎం.వెంకట సునీల్, కె.కృష్ణస్వామి, మహమ్మద్ ఫహీముద్దీన్‌లకు విక్రయించిన్నట్లు పోచయ్య మునిమనుమలు తెలుసుకున్నారు. 

తమకు తెలియకుండానే తమ భూమిలో 15 ఎకరాలు ఇన్ని చేతులు మారిన్నట్లు తెలుసుకొని వారు షాక్ అయ్యారు. వారిలో ఒకరైన మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్‌ వేసి, తమ భూపత్రాలకు నకిలీవి సృష్టించి 15 ఎకరాలు కాజేశారని, ఆ భూమిని తిరిగి తమకు ఇప్పించాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు.

బొత్స సందీప్ తదితరులు ఇది వివాదాస్పద భూమి అని తెలియక కొన్నారో తెలిసే కొన్నారో తెలీదు కానీ ఏపీలో ఎన్నికలు దగ్గర పడినప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు తెలంగాణలో భూవివాదంలో చిక్కుకోవడం, ఈ వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రతిపక్షాలకు ఆయన జవాబు చెప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. 


Related Post