కోర్టుకు వస్తా.. అనుమతించండి: కల్వకుంట్ల కవిత

May 04, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో తిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ ఈనెల 7వ తేదీతో ముగుస్తుంది. అంతకు ముందు రోజు ఆమె బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పనుంది. కనుక 7వ తేదీన స్వయంగా కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు అనుమతించవలసిందిగా ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టుని అభ్యర్ధించారు. 

ఇదివరకు ఆమె బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు కోర్టుకి తీసుకువచ్చినప్పుడు, ఆమె కోర్టు ఆవరణలో ఉన్న మీడియా ప్రతినిధులతో తన కేసు గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె కోర్టు ఆవరణలో ఆవిదంగా మాట్లాడినందుకు న్యాయమూర్తి కావేరీ బవేజా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆమెను కోర్టు విచారణకు హాజరు పరచాలని ఆదేశించారు. 

ఒకసారి ఆమె ఆవిదంగానే విచారణకు హాజరయ్యారు. కానీ ఈసారి తాను కోర్టులో స్వయంగా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆమె తన న్యాయవాది ద్వారా న్యాయమూర్తిని అభ్యర్ధించారు. అందుకు న్యాయమూర్తి ఒప్పుకుంటారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. 

మద్యం కేసులో చిక్కుకొని మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ జైలులో మగ్గుతున్నప్పుడు కూడా కల్వకుంట్ల కవిత కోర్టు ఆవరణలో పర్యవసానాలు తెలుసుకోకుండా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడటం వలన మరిన్ని కొత్త సమస్యలు ఆహ్వానిస్తున్నానని గ్రహించిన్నట్లు లేరు. 


Related Post