హైదరాబాద్‌ మెట్రో మరో సరికొత్త రికార్డు

May 03, 2024
img

హైదరాబాద్‌ మెట్రో  రైల్ సర్వీసులను 2017, నవంబర్‌ 28వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. అప్పటి నుంచి అత్యంత ప్రజాధరణతో లాభాల బాటలో దూసుకుపోతున్న మెట్రోకి, తొలిసారిగా కరోనా-లాక్‌డౌన్‌తో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 

అయినప్పటికీ మెల్లగా నిలద్రొక్కుకొని మళ్ళీ పుంజుకొని దూసుకుపోతోంది. నగరం నలుమూలలకు విస్తరిస్తూనే ఉంది. ఈ వేసవిలో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి వడగాడ్పులు వీస్తూండటంతో నగర ప్రజలందరూ హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. 

దీంతో ఇప్పుడు మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రోజుకి సగటున ఐదున్నర లక్షలు చేరిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈరోజు హైదరాబాద్‌ మెట్రో మరో అరుదైన రికార్డ్ సాధించింది. 2017లో మెట్రో ప్రారంభం అయినప్పటి నుంచి నేటి వరకు మొత్తం 50 కోట్ల మంది ప్రజలు మెట్రోలో ప్రయాణించారని చెప్పారు.  

ప్రజలు వాహనాలను పక్కన పెట్టి మెట్రోలో ప్రయాణిస్తుండటం వలన 14.5 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అయ్యిందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆవిష్కరించారు. మెట్రోపై ప్రజలకున్న నమ్మకం వలననే ఇది సాధ్యమైందన్నారు. మెట్రో రెండో దశకు సమగ్ర నివేదికలు సిద్దమయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. 

Related Post