హైదరాబాద్‌ మెట్రో కార్డు రద్దు... పెంపు కోసమేనా?

April 07, 2024
img

కరోనా, లాక్‌డౌన్‌ల సమయంలో హైదరాబాద్‌ మెట్రో సంస్థ తీవ్రంగా నష్టపోయింది. ఆ తర్వాత కూడా కరోనా భయంతో చాలా నెలల పాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరగలేదు. దాంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు రూ.59 నామమాత్రపు చార్జీతో హాలీడే కార్డులు ప్రవేశపెట్టింది. వాటితో వారాంతపు సెలవులు, పండుగ సెలవు రోజులలో రోజంతా మెట్రోలో తిరిగే అవకాశం కల్పించింది. వాటికి మంచి ఆదరణ లభించింది కూడా. 

కానీ ప్రస్తుతం ఎప్పుడు చూసినా మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పైగా వేసవి ఎండలు పెరిగిపోవడంతో చాలా మంది హాయిగా ఏసీ మెట్రోలో ప్రయాణించాలనుకోవడంతో మెట్రోలో రద్దీ ఇంకా పెరిగిపోయింది. 

కనుక హైదరాబాద్‌ మెట్రో సంస్థ హటాత్తుగా హాలీడే కార్డులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉందని అది ముగియడంతో వాటిని నిలిపివేస్తున్నామని ప్రకటించింది. మెట్రో టికెట్‌ ఛార్జీలు పెంచాలని గత ఏడాదే ప్రభుత్వానికి ప్రతిపాదించగా, అప్పుడు మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించడంతో హైదరాబాద్‌ మెట్రో అధికారులు ఏమీ చేయలేకపోయారు. బహుశః ఇప్పుడు ఈ హాలీడే కార్డులతో ఛార్జీల పెంపు కార్యక్రమం మొదలుపెడతారేమో?

Related Post