కాంగ్రెస్‌ ఓడిపోతే రేవంత్‌ దిగిపోక తప్పదు: హరీష్

April 28, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డిపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోతే రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందని బెంగపెట్టుకున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో ఇప్పుడు దేవుడి మీద ఓట్లు వేస్తూ మరోసారి ప్రజలను మభ్యపెట్టి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఓ వైపు ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతూనే మరోవైపు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని వాదిస్తూ సెంటిమెంట్ రగిలించేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి మోడీతో శాసనసభ ఎన్నికలకు ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఇప్పుడూ దానిని కొనసాగిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌, బీజేపీలు అప్పుడూ ఇప్పుడూ కూడా పరస్పరం సహకరించుకుంటున్నాయి. నామినేషన్స్‌ గడువు చివరి రోజు వరకు కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధులను ఖరారు చేయకపోవడమే ఇందుకు తాజా నిదర్శనం. 

బీజేపీ మత రాజకీయాలు చేస్తుంటే, రేవంత్‌ రెడ్డి సెంటిమెంట్ రగిలించాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఈ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలన ఏవిదంగా ఉంటుందో చూశారు. కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు లోక్‌సభ ఎన్నికల ద్వారా అవకాశం లభించింది. మేధావులు, ఉపాధ్యాయులు, అందరూ ఒకసారి కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పాలనలను బేరీజు వేసుకొని సరైన పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలి,” అని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. 


Related Post