తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా కీలకం

May 10, 2024


img

లోక్‌సభ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం ఏర్పటూ చేసుకోవడమే కోసమే జరుగుతున్నప్పటికీ, వివిద రాష్ట్రాలలో జాతీయ ప్రాంతీయ పార్టీల మనుగడ, ఎదుగుదలకు ఎంతో కీలకంగా మారాయి.

ముఖ్యంగా గత రెండు పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీ చేతిలో ఘోరపరాజయం పాలై అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈసారి కూడా ఓడిపోయి కేంద్రంలో అధికారంలోకి రాలేకపోతే ఇక బీజేపీని గద్దె దించడం బహుశః ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు.

కనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా పరిగణిస్తూ వాటికి తగ్గట్లు ఎన్నికల వ్యూహాలు రచించుకుని ముందుకు సాగుతోంది. 

బీజేపీ ఎంతగా బలపడినప్పటికీ, ఢిల్లీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్‌, హేమంత్ సొరేన్‌లను, తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయించడం, ఇంకా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి పలు రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేకత పెరిగిపోగా, అదే సమయంలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.

ఈ మార్పుని కాంగ్రెస్‌ అధిష్టానం కూడా గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీజేపీని ఓడించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. 

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మంత్రులు, పార్టీ నేతలు తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు చాలా శ్రమిస్తున్నారు. తద్వారా శాసనసభ ఎన్నికలలో గెలుపు గాలివాటం కాదని తెలియజెప్పడమే కాకుండా, తమ ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు.

ఈవిదంగా రాష్ట్రాలవారీగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నందున రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ వ్యూహాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే జూన్4న ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. 


Related Post