ఆర్‌ఆర్‌ టాక్స్ గురించి రేవంత్‌ ఏమన్నారంటే...

May 10, 2024


img

ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల నుంచి బలవంతంగా ‘ఆర్ఆర్ టాక్స్’ వసూలు చేసి మూటలు కట్టి ఢిల్లీలో తమ అధిష్టానానికి పంపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 

ఇక కేసీఆర్‌, కేటీఆర్‌ తదితర బిఆర్ఎస్ నేతలు లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, మళ్ళీ తాము అధికారంలోకి రాబోతున్నామని పదేపదే చెపుతున్నారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి టీవీ9 తెలుగుకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ రెండు అంశాల గురించి ఎడిటర్ రజనీకాంత్ ప్రశ్నించారు. వాటికి రేవంత్‌ రెడ్డి ఏమన్నారంటే, “ప్రధాన మంత్రి హోదాలో ఉన్న మోడీ నోటి నుంచి ఇటువంటి మాటలు వినడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన రాష్ట్రానికి ఏమైనా మేలు చేయాలనుకుంటే చేయాలి కానీ ఏమీ చేయకుండా, తెలంగాణలో పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

పైగా తెలంగాణకు వచ్చి నా ప్రభుత్వం గురించి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు-నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో మళ్ళీ లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైపోయింది.

కనుక మేము ఇంతవరకు ఏ సంస్థకు, ఏ పనికి కాంట్రాక్టులు ఇవ్వలేదు. ఎవరినీ సంప్రదించలేదు. తెలంగాణలో మతపరమైన అంశాల గురించి మాట్లాడుతూ ప్రజల మద్య చిచ్చు పెట్టవద్దని నేను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

తన ప్రభుత్వం కూలద్రోయడం గురించి మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినా కేసీఆర్‌ అహంకారం ఇంకా తగ్గలేదనడానికి ఇదే మరో నిదర్శనం. ఆయన ఏపీలో వైసీపి గెలిస్తే, జగన్మోహన్‌ రెడ్డి సాయంతో మా ప్రభుత్వాన్ని కూలద్రోయాలని ఆశపడుతున్నట్లు మాకు తెలుసు. కానీ అది జరిగేది కాదు.

ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి విజయం సాధించబోతోందనే సమాచారం మాకుంది. కేసీఆర్‌ మా ప్రభుత్వాన్ని కూలద్రోయాలని ప్రయత్నిస్తే బిఆర్ఎస్ పార్టీలో ఒక్కరూ కూడా మిగలరు.

ఇప్పటికే చాలా మంది పార్టీని వీడి మావద్దకు వచ్చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలినవారు కూడా వచ్చేస్తారు. ఇంతవరకు నేను పాలన మీదే దృష్టి పెట్టి పనిచేసుకుంటున్నాను. కానీ కేసీఆర్‌ మా ప్రభుత్వం జోలికి వస్తే చేతులు ముడుచుకొని కూర్చోము. ఏం చేయాలో నాకు బాగా తెలుసు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.



Related Post