ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? అయితే మీ వెంట తెలంగాణ పోలీస్

May 19, 2024
img

ఎప్పుడైనా వేరే ప్రాంతానికి వెళుతున్నప్పుడు, ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒంటరి ప్రయాణం కొంచెం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు, వారు తిరిగి వచ్చే వరకు ఇంట్లో వారు ఆందోళన చెందుతుండటం అందరికీ అనుభవమే. 

అదే రాత్రిపూట ఒంటరి ప్రయాణలంటే ఇంకా ఆందోళనకరంగానే ఉంటాయి. ఈ సమస్యను, దాని తీవ్రతను గుర్తించిన తెలంగాణ పోలీస్ శాఖ టి-సేఫ్ పేరుతో ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మొబైల్ ఫోన్లోకి డౌన్‌లోడ్‌ చేసుకొని తమ వివరాలు నమోదు చేసుకోవలసి ఉంటుంది. 

మహిళలు ఒంటరిగా క్యాబ్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఒంటరిగా ప్రయాణం చేసే ముందు, ఈ యాప్‌ ద్వారా తాము ఎక్కడి నుంచి ఎక్కడకు వెళుతున్నారో తెలియజేసి, లైవ్ లొకేషన్ షేర్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ప్రయాణం ముగిసే వరకు పోలీస్ శాఖలో ని మహిళా రక్షణ విభాగం, ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ట్రాకింగ్ చేస్తుంటుంది.

 ఒకవేళ ప్రయాణ సమయంలో డ్రైవర్ లేదా వాహనంలో ఇతర వ్యక్తులు ఏమైనా ఇబ్బంది కలిగితే,  100 లేదా 112 నంబర్‌ని ప్రెస్‌ చేస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ నుంచి పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి అడ్డుకుని ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళని కాపాడుతారు.

ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత గమ్యం చేరేలోగా మద్యలో పోలీసులు ‘అంతా ఓకేనా?’ అంటూ అప్పుడప్పుడు మెసేజ్‌లు పంపుతుంటారు. వాటికి ప్రయాణికురాలీ నుంచి జవాబు రాకపోయినా వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి, ఆ కారును వెంబడించి పట్టుకుంటారు. కనుక ఈ ‘టీ-సేఫ్’ యాప్ రాష్ట్రంలో ప్రతీ మహిళా మొబైల్ ఫోన్లో కలిగి ఉండటం చాలా అవసరమే. అది ఫోన్లో ఉంటే తెలంగాణ పోలీస్ మన వెంట ఉన్నట్లే. ఇంకెందుకు ఆలస్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ టీ-సేఫ్ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోండి. సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి.  

ఇదిగాక మహిళల రక్షణ కోసం తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా వాట్సప్ నంబర్: 87126 56856 కూడా అందుబాటులోకి తెచ్చింది. మహిళలు ఈ నెంబర్ మొబైల్ ఫోన్లో ఉంచుకుంటే అత్యవసరం సమయంలో వెంటనే పోలీసులను సంప్రదించి సహాయం పొందవచ్చు.            


Related Post