రేవంత్‌ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ!

May 19, 2024


img

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు జరుగుతాయని మూడు ప్రధాన పార్టీలు చెప్పుకుంటూనే ఉన్నాయి. అయితే ఇంకా ఫలితాలు వెలువడక మునుపే మారేట్లున్నాయి. 

ఆగస్టులో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడబోతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కానీ బీజేపీలోనే సంక్షోభం ఏర్పడేలా ఉంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యే శనివారం సాయంత్రం సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. 

బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్‌తో సిఎం రేవంత్‌ రెడ్డి సుమారు అరగంట సేపు ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడేందుకే తాము సిఎం రేవంత్‌ రెడ్డిని కలిశామని చెప్పుకుంటూ ఓ వినతి పత్రం ఇస్తూ ఫోటో దిగారు. 

కానీ ఒకవేళ బీజేపీ తరపున సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకుంటే ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈవిషయం తెలియజేసి ఆయన అనుమతితో 8 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలవాల్సి ఉంటుంది. కానీ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు హటాత్తుగా రేవంత్‌ రెడ్డిని కలవడంతో వారు పార్టీ మారేందుకే వెళ్ళి కలిశారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

వారిలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. పైడి రాకేశ్ రెడ్డి, రామారావు పటేల్ ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరినవారే. కనుక వారికి బీజేపీతో కంటే కాంగ్రెస్‌తోనే బలమైన అనుబందం ఉంది. కనుక ముగ్గురూ మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకునేందుకే సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో మరి కొని రోజులలో తేలిపోతుంది.  



Related Post