శనివారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగవలసి ఉండగా ఈసీ అనుమతి లభించకపోవడంతో రద్దు అయ్యింది. నేడు ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కానీ కొన్ని షరతులు విధించింది.
జూన్ 4వ తేదీలోగా అత్యవసరంగా నిర్వహించాల్సిన పనుల గురించి మాత్రమే చర్చించాలని సూచించింది. విభజన సమస్యలు, పంట రుణాల మాఫీ, సంక్షేమ పధకాలకు నిధులు కేటాయింపు, వాటి అమలు వంటి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించరాదని సూచించింది.
ఎన్నికల విధులలో ఉన్న అధికారులు ఎవరూ కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో పాల్గొనరాదని సూచించింది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి తమకు తెలియజేయాలని ఈసీ సూచించింది.
ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చర్చించాలనుకున్న పంట రుణాల మాఫీ, విభజన సమస్యలు వంటివారిపై నిషేధం విధించింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తుందా లేక ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత నిర్వహిస్తుందో చూడాలి.