విజయశాంతి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లోనే ఉన్నారు కానీ ఆ పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా ఆమె కనబడటం లేదు. ఈ నేపధ్యంలో ఆమె ప్రాంతీయ పార్టీలు దక్షిణాది ప్రజల భావోద్వేగాలకు ప్రతీకలవంటివని, అటువంటి బిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో కనబడకుండా చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పడం దక్షిణాది ప్రజల రాజకీయ విధానం పట్ల అవగాహన లేకపోవడమే అని ట్వీట్ చేశారు.
ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బిఆర్ఎస్ పార్టీని అనుకూలంగా ట్వీట్ చేయడంతో ఆమె మళ్ళీ బిఆర్ఎస్ గూటికి చేరుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారంటూ ఊహాగానాలు మొదలైపోయాయి.
వాటిపై ఆమె మళ్ళీ వెంటనే స్పందిస్తూ “దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం నిన్నటి నా పోస్టుల ద్వారా వ్యక్తపరిస్తే, దాని సారాంశాన్ని అవగాహన చేసుకునే తత్వం లేని కొందరు, ఆ పోస్టుపై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా కథనాలు వారే రాసి వ్యాఖ్యానిస్తూ తమ తమ సొంత కల్పన కొనసాగిస్తున్నరు.. సరే... అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కాని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్నవాళ్లకు వివరణలు ఇచ్చి ప్రయోజనం లేదు...” అంటూ మరో ట్వీట్ చేశారు.
ఆమె చెప్పింది నిజమే. ఆమె ప్రాంతీయ పార్టీల గురించి తన అభిప్రాయం చెప్పారని అర్దమవుతూనే ఉంది. కానీ గతంలో ఆమె పార్టీలు మారిన తీరుని, ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆమె పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుని కొందరు ఆమె పార్టీ మారవచ్చని ఊహించి ఉండవచ్చు. ఇలా ఖండించినవారే తర్వాత పార్టీలు మారుతుంటారు కనుక విజయశాంతి ఎవరినో తప్పి పట్టవలసిన అవసరమే లేదు. అవి పుకార్లు లేదా ఊహాగానాలే అని ఆమె నమ్ముతున్నట్లయితే వాటిని ఆమె పట్టించుకోనవసరం లేదు.