ఖమ్మంలో మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవానికి సిద్దం

May 19, 2024


img

గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడులో ఓ మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటయింది. కానీ దాని నిర్మాణ పనులన్నీ పూర్తికాకపోవడంతో దానిని అందుబాటులోకి తేలేకపోయింది.

మిగిలిన పనులు పూర్తవడంతో ఇప్పుడు అది ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత దానిని ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. 

దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ పార్కులో ప్రధానంగా చుట్టుపక్కల జిల్లాలలో లభించే వ్యవసాయ ఉత్పత్తులతో ఆహార ఉత్పత్తులను తయారుచేసే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు.

జామ, మామిడి, మొక్కజొన్న, చెరుకు, కొబ్బరి, ఆయిల్ పామ్ తదితర వ్యవసాయ ఉత్పత్తులతో పాటు, మాంసాహార ఉత్పత్తులను కూడా ప్రాసెసింగ్ చేసి తయారు చేస్తారు. పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో, పెరుగు, వెన్న వంటి ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు దీనిలో ఏర్పాటు కానున్నాయి. 

ఈ మెగా ఫుడ్ పార్కుని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ఇస్తుండటంతో దీనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు 70 సంస్థలు ముందుకు వచ్చాయి. 

వాటిలో ఇన్‌స్టాంట్ నూడుల్స్, రైస్ బ్రౌన్ తదితర నూనెలు, మసాలా దినుసులు-పొడులు, శాఖాహార, మాంసాహార ఫ్రొజెన్ ఫుడ్స్ వంటి రకరకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలున్నాయి.

ఈ మెగా ఫుడ్ పార్కు ప్రారంభోత్సవం అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు చుట్టుపక్కల జిల్లాలో మొక్కజొన్న, మిర్చి, వరి తదితర పంటలు పండించే రైతులకు, పాడి రైతులకు, గొర్రెలు,మేకల పెంపకందారులకు, కోళ్ళ ఫారాల యజమానులకు చాలా లబ్ధి కలుగుతుంది.

ఈ మెగా ఫుడ్ పార్కులో ఏర్పాటైన పరిశ్రమలే వారితో ముందస్తు ఒప్పందాలు చేసుకుని వారి ఉత్పత్తులను గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి. కనుక ఇకపై వారు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి దళారులు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.


Related Post