బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ఆ రెండే కారణాలు: కేటీఆర్‌

May 19, 2024


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయి. అవన్నీ ప్రజలకు కూడా తెలుసు. కనుక వాటి గురించి మళ్ళీ ఇప్పుడు పోస్ట్ మార్టం అనవసరం. అయితే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈరోజు తమ ఓటమికి ఈ రెండు కారణమని చెప్పారు కనుక మళ్ళీ దీని గురించి మాట్లాడుకోవలసి వస్తోంది. 

ఈ నెల 27న జరుగబోయే వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహాలలో భాగంగా నేడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “చేసిన పనుల గురించి చెప్పుకోకపోవడం, కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం వలననే శాసనసభ ఎన్నికలలో మనం ఓడిపోయాము.

మోడీ రాముడి గుడి కట్టించి ఓట్లు అడుగుతున్నారు. మనం కూడా యాదాద్రి ఆలయాన్ని పునర్మించాము. కానీ ఆ పేరుతో ఎవరినీ ఓట్లు అడగలేదు. మనం ప్రాజెక్టులు నిర్మించి వాటికి దేవుడి పేర్లు పెట్టి ఓట్లు అడుగుతున్నాము. బీజేపీకి మనకే అదే తేడా,” అని అన్నారు.

అయితే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు చెప్పుకోలేదనే మాట అవాస్తవమే అని అందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరధ, దళితబంధు, రైతు బంధుల గురించి మాత్రమే కాదు భవిష్యత్‌లో నిర్మించబోయే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, భవిష్యత్‌లో అమలుచేయబోయే గిరిజన బంధు, ముస్లిం బంధు వంటి పధకాల గురించి కూడా ప్రజల చెవులు చిల్లులు పడేలా గొప్పలు చెప్పుకున్నారు. ఎన్నికలలో వాటి గురించి ప్రచారం చేసుకున్నారు కూడా. 

అయితే కొన్ని వర్గాలను దూరం చేసుకున్నామనే కేటీఆర్‌ మాట నూటికి నూరు శాతం నిజమే. అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులను, దళితులను దూరం చేసుకున్నారు. ప్రతిపక్షాల గొంతులు నొక్కేస్తూ ప్రజాస్వామ్యానికి దూరమయ్యారు. 

ఆర్టీసీ కార్మికులు కడుపు మాడి సమ్మె చేస్తే సుమారు 45-50 మంది చనిపోయినా కేసీఆర్‌ వారి పట్ల చాలా కటినంగా వ్యవహరించి వారిని దూరం చేసుకున్నారు. ప్రాజెక్టులు, యాదాద్రి కోసం బలవంతపు భూసేకరణ చేసి రైతుల కంట కన్నీళ్ళు పెట్టించి వారిని దూరం చేసుకున్నారు. 

అన్నీ మాకే తెలుసు అనే ధోరణి వలన మేధావులు, విద్యావేత్తలను దూరం చేసుకున్నారు. మోడీని తిట్టిపోసి కేంద్రానికి దూరం అయ్యారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌తో కయ్యం పెట్టుకొని ఆమెను అవమానించారు.

చివరికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసిన త్రిదండి చినజీయర్ స్వామిని దూరం చేసుకున్నారు. ఇలా దూరం చేసుకున్నవారి జాబితా చాలా పెద్దదే ఉంది.

కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరిస్తుండటం చూస్తే, నేటికీ బిఆర్ఎస్ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకొని తప్పులను సవరించుకునే ఉద్దేశ్యం లేదని స్పష్టం అవుతోంది. కనుక ఇంకా ఎదురుదెబ్బలు కూడా తప్పక పోవచ్చు.


Related Post