తమ్ముడు కోసం పిఠాపురం వెళ్ళేదేలే!

May 10, 2024


img

ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించి, ఆయనకు ఓట్లు వేసి ఎన్నికలలో గెలిపించవలసిందిగా పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మరికొందరు సినీ నటులు పిఠాపురానికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడుకి మద్దతు ప్రకటిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కనుక ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి పిఠాపురం బయలుదేరుతారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి. 

వాటిపై చిరంజీవి స్పందిస్తూ, “ నేను రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుంటున్నాను. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు కనుక తనకి మద్దతు తెలుపుతూ వీడియో సందేశం విడుదల చేశాను. కానీ నేను పిఠాపురం వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయడం లేదు. చేస్తానని మీకు మీరే ఊహించేసుకుని రాసేశారు. కనుక మీ ఊహాజనితమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. 

పవన్‌ కళ్యాణ్‌ ప్రజల కోసం ఏదో చేయాలని తపిస్తున్నాడు. అతను తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగుతున్నాడు. అతని లక్ష్యం నెరవేరాలని నేను మనసారా కోరుకుంటున్నాను,” అని చిరంజీవి చెప్పారు. 

తన మరో తమ్ముడు నాగబాబు, ఆయన భార్య పద్మజతో సహా సినీ పరిశ్రమ నుంచి అనేకమంది పిఠాపురం వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు, చిరంజీవి తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎన్నికల ప్రచారం చేయడానికి వెనకాడుతున్నారు. 

ఎందుకంటే ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పవన్‌ కళ్యాణ్‌ని బద్ద శత్రువుగా భావిస్తున్నారు. కనుక తమ్ముడు తరపున ఎన్నికల ప్రచారం చేస్తే జగన్‌కు ఆగ్రహం కలుగుతుందని, ఒకవేళ జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏపీలో తన సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతాయని చిరంజీవి భయపడుతున్నారేమో?

కానీ తమ్ముడు కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తన సినిమాలను ఆదరించి మెగాస్టార్‌గా ఎదిగేందుకు తోడ్పడిన ఆంధ్రా ప్రజల కోసం చిరంజీవి జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయకపోవడం సబబు కాదనే చెప్పాలి. 


Related Post