ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ

May 10, 2024


img

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నేడు కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఇంటలిజన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసేందుకు నాంపల్లి కోర్టు నేడు వారెంట్ జారీ చేసింది. 

ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. నాలుకపై కణితి ఏర్పడటంతో దాని చికిత్స కోసం కొన్ని నెలల క్రితం అమెరికా వెళ్ళారు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయవద్దని, చికిత్స పూర్తి కాగానే హైదరాబాద్‌ తిరిగి వచ్చి ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని తన న్యాయవాది ద్వారా కోర్టుకి విన్నవించుకున్నారు. 

కానీ కోర్టు ఆయన అభ్యర్ధనను తిరస్కరించి సీఆర్పీసీ 73 కింద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అమెరికాలోనే ఆయనను అరెస్ట్ చేయించి హైదరాబాద్‌కు రప్పించుకునే అవకాశం ఏర్పడుతుంది. 

ఈ ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఇంటలిజన్స్ బ్యూరో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. తాము ప్రభాకర్ రావు ఆదేశం ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌ చేసేవారిమని చెప్పారు. 

అయితే ప్రభాకర్ రావు తాను ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వంలో కొందరు ప్రముఖుల ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్‌ చేయించాల్సి వచ్చిందని, తనంతట తానుగా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు ఉండదని తెలియజేశారు. 

కానీ ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, అధికారులు ఎవరైనా తప్పులు చేస్తే వాటికి వారే బాధ్యులని కేసీఆర్‌ ఇటీవలే చెప్పేశారు. కానీ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తే ఈ కేసు కేసీఆర్‌ ఇంటి గుమ్మం వరకు వచ్చేసిన్నట్లే భావించవచ్చు. 


Related Post