సజ్జనార్ కూడా పునీతుడు కాదట!

May 10, 2024


img

ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి టిఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వీసీ సజ్జనార్ భారీగా అక్రమాస్తులు పోగేసుకున్నారు. కరోనా సమయంలో ఆయన వందల కోట్లు విలువ చేసే మందులు హైదరాబాద్‌ నుంచి అక్రమంగా కర్ణాటకకు తరలించి భారీగా డబ్బు సంపాదించుకున్నారు. ఆ డబ్బుతో హైదరాబాద్‌, హుబ్లీతో సహా అనేక ప్రాంతాలలో ఆస్తులు కొనుగోలు చేశారు. వాటన్నిటిపై విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. 

శాసనసభ ఎన్నికలలో నేను ఆర్మూర్‌లో ఓడిపోవడానికి కారణం ఆయనే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజ్యసభ సీటు కోసం ఆశపడి రేవంత్‌ రెడ్డి చెప్పిన్నట్లు ఆడుతున్నారు. రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేసి వెళ్ళగానే సజ్జనార్ 200 మంది టిఎస్‌ఆర్టీసీ సిబ్బందిని నా షాపింగ్ మాల్‌పైకి పంపించి అందరినీ భయభ్రాంతులను చేశారు. 

పార్లమెంట్‌ ఎన్నికలలో నిజామాబాద్‌లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందనే కక్షతోనే రేవంత్‌ రెడ్డి సజ్జనార్‌ని నా సంస్థపైకి ఉసిగొలిపారని నాకు తెలుసు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా టిఎస్‌ఆర్టీసీ అధికారులు ఈవిదంగా ప్రవర్తిస్తుంటే ఎన్నికల సంఘం ఏమి చేస్తోంది?” అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

జీవన్ రెడ్డి ఆర్మూరులో టిఎస్‌ఆర్టీసీకి చెందిన భూమిని లీజుకి తీసుకొని షాపింగ్ మాల్‌ కట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ టిఎస్‌ఆర్టీసీకి చెల్లించాల్సిన లీజు మొత్తం రూ.2 కోట్లు చెల్లించ లేదు. విద్యుత్ బకాయిలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.            

ఇప్పుడు జీవన్ రెడ్డిని బకాయిలు చెల్లించమని ఒత్తిడి చేస్తే సజ్జనార్ గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాలు ఆయన బయటపెట్టారు.

ఒకవేళ ఆయన చెప్పింది కూడా నిజమే అనుకుంటే సజ్జనార్ కూడా అవినీతికి పాల్పడ్డారని అర్దమవుతుంది. ఈ విషయం కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిసి ఉన్నా సజ్జనార్‌పై కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా టిఎస్‌ఆర్టీసీకి ఎండీగా నియమించారు కూడా. 

కేసీఆర్‌ హయాంలో చాలా అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తుంటే, బిఆర్ఎస్ నేతలు ఖండిస్తుంటారు. తామందరం ఆణిముత్యాలమే అన్నట్లు చెప్పుకుంటారు. మరి జీవన్ రెడ్డి, సజ్జన్నార్‌లను, వారిపై కేసీఆర్‌ చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమనుకోవాలి? కాంగ్రెస్‌ ఆరోపణలు నిజమే కదా?


Related Post