రేవంత్‌ జేబులో డబ్బు తీసి రైతుబంధు ఇస్తున్నాడా?

April 28, 2024


img

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, నాగర్‌కర్నూల్‌ పార్టీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ తరపున శనివారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు పధకం అమలు విషయంలో రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

 “రేవంత్‌ రెడ్డి తన జేబులో డబ్బు తీసి రైతుబంధు ఇస్తున్నాడా? ప్రజల సొమ్ము ప్రజలకు తిరిగి ఇవ్వడానికి ఆయనకు ఎందుకు బాధ?రైతుబంధు 5 ఎకరాలలోపు రైతులకు మాత్రమే ఇస్తానంటే 5 ఎకరాలు మించి ఉన్నవాళ్ళు వ్యవసాయం మానుకోవాలా?వాళ్ళకి ఎవరు డబ్బు ఇస్తారు?

 కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక ఇలా కొత్త కొత్త ఆంక్షలు విధించి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కనుక ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ పార్లమెంట్‌ సీట్లు ఇచ్చి గెలిపిస్తే మీ అందరి తరపున మేము కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి అన్ని హామీలు అమలు చేయిస్తాము,” అని కేసీఆర్‌ అన్నారు. 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ తర్వాత కేంద్రం, ప్రధాని నరేంద్రమోడీని విమర్శించకుండా సంయమనం పాటించిన కేసీఆర్‌, మళ్ళీ నిన్న తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వం ఆకర్షణీయమైన నినాదాలు చేయడం తప్ప గత పదేళ్ళలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కనీసం ఒక్క ప్రాజెక్టుకి జాతీయహోదా ఇవ్వలేదన్నారు. 

కాంగ్రెస్‌, బీజేపీలకు తెలంగాణ రాష్ట్రం, ప్రజల పట్ల ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని రెండూ తమ రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యాయని కనుక వాటి వలన తెలంగాణకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదని కేసీఆర్‌ అన్నారు. 

బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రవీణ్ కుమార్‌ ఉన్నత విద్యావంతుడు, మాజీ ఐపిఎస్ అధికారి. ఆలంపూర్‌లో పుట్టి పెరిగినవాడు. ఇప్పుడు తన సొంత గడ్డకు, ప్రజలకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చాడు కనుక ఆయనను ఆశీర్వదించి గెలిపింహ్కాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.    



Related Post