కన్నప్పలో ప్రభాస్‌ పాత్ర శివుడు కాదా?

May 12, 2024


img

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తీస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌ శివుడిగా నటిస్తున్నారని ఇంతకాలం వార్తలు వచ్చాయి. ఇటీవలే ప్రభాస్‌ కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయ్యారని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేశారు కూడా. అయితే కన్నప్పలో ప్రభాస్‌ శివుడు పాత్ర కాకుండా మరేదో ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లు మంచు విష్ణు చెప్పారు. 

తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో సందేశంలో, “కన్నప్పలో అనేక అద్భుతమైన పాత్రలున్నాయి. వాటిని ప్రభాస్‌ వంటి ప్రముఖ నటులు చేస్తే మరింత అద్భుతంగా ఉంటుందని భావించి, ఓ పాత్ర కోసం ఆయనకు కధ వినిపించాను. కధ అంతా విన్న తర్వాత నేను చెప్పిన పాత్ర కంటే మరో పాత్ర చేస్తానని చెప్పారు.

ప్రభాస్‌ తనకు నచ్చిన పాత్ర చేస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది?ఆ పాత్రలో ప్రభాస్ని చూసి అభిమానులు చాలా సంతోషిస్తారు. త్వరలోనే కన్నప్పలో ఒక్కో పాత్రని మీ ముందుకు తీసుకువస్తాము. కనుక అంత వరకు ప్రభాస్‌ చేస్తున్న పాత్ర ఆదా... ఇదా... అని ఊహాగానాలు చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని మంచు విష్ణు చెప్పారు.

మంచు విష్ణు చెప్పిన దాని ప్రకారం శివుడి పాత్రలో ప్రభాస్‌ చేయడం లేదని స్పష్టం అవుతోంది. ఈ సినిమాలో శివపార్వతులుగా కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్‌, ప్రభాస్‌ నందీశ్వరుడుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

రామోజీ ఫిలిమ్ సిటీలో కన్నప్ప సినిమా షూటింగ్‌లో అక్షయ్ కుమార్‌ పాల్గొంటున్నారు కూడా. త్వరలో కాజల్ అగర్వాల్ కూడా పాల్గొనబోతున్నారు. 

కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష