బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం మీడియా సమావేశంలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో బిఆర్ఎస్ కీలక పాత్ర పోషించడం గురించి చెప్పిన మాటలపై తెలంగాణ అంతటా కొత్త చర్చ మొదలైంది.
గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఇలాగే బీజేపీ ఓడిపోతుందని చెప్పారు. బిఆర్ఎస్‌కు 16 సీట్లు ఇస్తే తాను కేంద్రంలో చక్రం తిప్పుతానని ‘కారు..సారు.. ఢిల్లీ సర్కారు...’ అంటూ తెగ ప్రచారం చేసుకున్నారు. కానీ కేంద్రంలో మళ్ళీ బీజేపీయే వచ్చింది. కేసీఆర్ తెలంగాణకే పరిమితమయ్యారు.
ఆ తర్వాత బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ మహారాష్ట్రలో చాలా హడావుడి చేశారు. కర్ణాటకలో కుమార స్వామిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. ఆంధ్రా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. కానీ తెలంగాణ దాటి బయటకు వెళ్ళడం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే.
కనుక ఈ లోక్‌సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ ఓడిపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కనుక మోడీపై మళ్ళీ యుద్ధం ప్రకటించి, ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా కూతురు కల్వకుంట్ల కవిత మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ మోడీపై కత్తులు దూసే సాహసం చేస్తారనుకోలేమని, ఇదంతా ఎంపీ సీట్ల కోసం కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.