ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏవిదంగా ఉండబోతున్నాయో తన అంచనా చెప్పారు.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఆర్‌టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీజేపీల మద్యనే ఉంటుంది. ఆ రెండు పార్టీలు చెరో 6-7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. రెండు మూడు సీట్లు అటూ ఇటూ కావచ్చు కానీ కాంగ్రెస్, బీజేపీలే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నాయి.
బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పుకుంటున్నట్లుగా 12కి పైగా సీట్లు గెలుచుకోవడం అసంభవమని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కేసీఆర్ బస్సు యాత్రల వలన బిఆర్ఎస్ పార్టీ కాస్త పుంజుకున్న మాట వాస్తవమే కానీ కాంగ్రెస్, బీజేపీలకు పోగా మిగిలిన సీట్లు మాత్రమే బిఆర్ఎస్ పార్టీకి వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
ఈసారి బీజేపీకి 220 సీట్లకు మించి రావని, కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయనే కేసీఆర్ మాటలను కూడా ప్రశాంత్ కిషోర్ కొట్టిపడేశారు. బీజేపీ చెప్పుకుంటున్నట్లు 400కిపైగా సీట్లు రావు కానీ ఈసారి కూడా బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
పదేళ్ళు రాష్ట్రాన్ని ఎదురు లేకుండా పాలించిన కేసీఆర్‌కు శాసనసభ ఎన్నికలలో ఓటమి జీర్ణించుకోవడం కష్టమేనని, కానీ క్రమంగా తేరుకొని తప్పులను సవరించుకుని ముందుకు సాగితే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అయితే ఎంతకాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగలదనేది ఆ పార్టీ అధిష్టానం ఆలోచనలు, వైఖరి, విధానాలపైనే ఆధారపడి ఉంటుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.