బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన బస్సు యాత్రలకు ప్రజల నుంచి ఆశించిన దానికంటే మంచి స్పందన రావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించినప్పుడు ఆయన మాటలలో ఆ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించాయి.
ఈ సందర్భంగా ఆయన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, జాతీయ రాజకీయాల గురించి మరింత వివరంగా మాట్లాడుతూ, “ఈసారి బీజేపీకి 400కి పైగా సీట్లు వస్తాయని ఎందుకు చెప్పుకుంటున్నారంటే, 200 సీట్లు కూడా రావని ముందే పసిగట్టడం వలననే. ఓటమి భయంతోనే మోడీ, అమిత్ షాలు ఈవిదంగా మాట్లాడుతున్నారు. ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఇదే సమయంలో దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలపడ్డాయి. కనుక కాంగ్రెస్, బీజేపీలే ఈసారి ప్రాంతీయ పార్టీల కూటమి (థర్డ్ ఫ్రంట్?)కి మద్దతు ఈయక తప్పని పరిస్థితి కలుగుతుంది. మేము వాటికి మద్దతు ఇచ్చే పరిస్థితి రోజులు ఎప్పుడో పోయాయి.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి 12 సీట్లుపైగా గెలుచుకోవడం ఖాయం. ఏపీ,తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ ‘వన్ ర్ నన్’ (ఒక్క సీటు లేదా అదీ రాకపోవచ్చు). తెలంగాణలో 2-3 సీట్లు గెలుచుకుంటే చాలా ఎక్కువే. అది రెండో స్థానంలో నిలవచ్చు.
తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి 14 సీట్లు ఇచ్చి గెలిపిస్తే జాతీయ రాజకీయాలలో నా తడాఖా ఏమిటో చూపిస్తాను. నేను కూడా ప్రధాని రేసులో ఉన్నాను. అవకాశం వస్తే తప్పకుండా ప్రధానమంత్రి పదవి చేపడతాను. తెలంగాణ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ రాజకీయాలు చేస్తాను,” అని కేసీఆర్ చెప్పారు.