ఏపీ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ జగన్ గెలిచి ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్ జోస్యం చెపుతున్నా, ఏపీలో రాజకీయ పరిణామాలు, ప్రజల మూడ్ మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా ఉంది.
వైఎస్ కుటుంబానికి కంచుకోట కడప నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా వైఎస్ షర్మిల, అవినాష్ రెడ్డి వైసీపి అభ్యర్దిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. జగన్ తన సొంత చెల్లెలును కాదని బాబాయ్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మద్దతు ఇస్తూ, చెల్లినే నిందిస్తున్నారు.
వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను వివేకా హత్య గురించి గట్టిగా నిలదీస్తున్నారు. దీంతో కొడుకు, కూతురులో ఎవరివైపు ఉండలేక వారి తల్లి విజయమ్మ అమెరికాలో మనుమారాలి దగ్గరకు వెళ్ళిపోయారు.
ఆమె పరిస్థితిని అందరూ అర్దం చేసుకోగలరు కనుక ఆమె ‘న్యూట్రల్’గా ఉన్నారని అనుకున్నారు. కానీ మరో 48 గంటలలో పోలింగ్ జరుగబోతుంటే విజయమ్మ ఓ వీడియో సందేశం ద్వారా కడప నుంచి పోటీ చేస్తున్న తన కూతురు వైఎస్ షర్మిలని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రభావం ఒక్క కడపపైనే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపిపై పడుతుంది. జగన్మోహన్ రెడ్డికి తల్లి విజయమ్మ కూడా మద్దతు ఇవ్వలేదు. కొడుకు కంటే కూతురే నయమనుకున్నారని టిడిపి, జనసేన, బీజేపీలు ప్రచారం చేయకుండా ఉండవు.
అయితే వాటికి ఆ అవకాశం ఇవ్వకూడదనే బహుశః ఎన్నికల ప్రచారం మరో గంటలో ముగుస్తుందనగా ఇప్పుడు ఆ వీడియోని విడుదల చేశారు. కానీ టిడిపి, జనసేన, బీజేపీలు ఈ మాత్రం సమయం, అవకాశం చాలు... జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టడానికి.. పోలింగ్ కు ముందు తల్లి విడుదల చేసిన ఈ వీడియో సందేశం జగన్మోహన్ రెడ్డికి మరో శాపంగా మారుతుందేమో?