శ్రీరాముడుని దేశ ప్రజలకు బీజేపీ పరిచయం చేసిందా?

April 28, 2024


img

బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం కరీంనగర్‌లో పార్టీ అభ్యర్ధి వినోద్ కుమార్‌ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, దాని అభ్యర్ధి బండి సంజయ్‌పై నిశిత విమర్శలు చేశారు. 

“బీజేపీ తీరు ఎలా ఉందంటే తామే శ్రీరాముడిని కనిపెట్టి దేశ ప్రజలకు పరిచయం చేసిన్నట్లు, అంతకు ముందు ఎవరికీ శ్రీరాముడు దేవుడు అనే విషయం కూడా తెలియదన్నట్లు వ్యవహరిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ శ్రీరాముడుని మద్యలోకి తెస్తుంటుంది. 

శ్రీరాముడు ఏమైనా బీజేపీ అధ్యక్షుడా లేక ఆ పార్టీ అభ్యర్ధా? లేక ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేనా? బీజేపీ ఉన్నా లేకపోయినా శ్రీరాముడు ఎప్పుడూ హిందువులకు దేవుడే. కనుక శ్రీరాముడు గురించి బీజేపీ దేశ ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

అయినా భగవంతుడైన శ్రీరాముడిని ఎన్నికలలో వాడుకోవడం సరికాదు. ఈ పదేళ్ళలో బీజేపీ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు కనుకనే శ్రీరాముడు పేరుతో ప్రజలను ఓట్లు అడుగుతోంది. బండి సంజయ్‌ 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు. కానీ కేంద్రం నుంచి కరీంనగర్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేకపోయారు. అందుకే ఆయన కూడా శ్రీరాముడు గురించి మాట్లాడుతున్నారు. 

రేవంత్‌ రెడ్డి కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవడంతో మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు దేవుడిపై ఓట్లు వేస్తూ, రిజర్వేషన్ల పేరుతో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్‌లో బిఆర్ఎస్‌ అభ్యర్ధి వినోద్ కుమార్‌ని ఎదుర్కోలేక, రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ కుమ్మక్కయ్యారు. కానీ కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్ని ఎత్తులు వేసినా కరీంనగర్‌లో గెలిచేది వినోద్ కుమారే,” అని అన్నారు.


Related Post