హెచ్‌సీఏ కోచ్ జైసింహపై సస్పెన్షన్ వేటు

February 16, 2024
img

హెచ్‌సీఏ కోచ్ జైసింహపై సస్పెన్షన్ వేటు పడింది. విజయవాడలో క్రికెట్ మ్యాచ్ ఆడి బస్సులో తిరిగి వస్తుండగా, బస్సులో మహిళా క్రికెటర్ల ఎదుటే మద్యం త్రాగినందుకు, వద్దని చెప్పినందుకు వారిని బూతులు తిడుతూ అసభ్యంగా వ్యవహరించినందుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్ జైసింహాపై సస్పెన్షన్ వేటు వేశారు. నిజానికి వారందరూ గన్నవరం నుంచి విమానంలో హైదరాబాద్‌ చేరుకోవలసి ఉంది. కానీ జైసింహా ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేయడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో రావలసి వచ్చిందని మహిళా క్రికెటర్లు ఆరోపించారు. 

బస్సులో కూర్చోగానే జైసింహా వెంట తెచ్చుకున్న మద్యం బాటిల్ తీసి అందరి ఎదుట మద్యం తాగుతూ తమని ఉద్దేశ్యించి అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టారని మహిళా క్రికెటర్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌కు పిర్యాదు చేశారు. ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్లు కూడా బస్సులోనే ఉనప్పటికీ వారు కూడా జైసింహాని వారించకపోగా మరింత ప్రోత్సహిస్తున్నట్లు వ్యవహరించారని మహిళా క్రికెటర్లు ఆరోపించారు. 

జైసింహా బస్సులో మద్యం తాగుతూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు, వారిలో కొందరు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి, ఆ వీడియోలను హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌కు చూపించడంతో వెంటనే జైసింహాని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనలపై విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారించేవరకు జైసింహా హెచ్‌సీఏకు, మహిళా క్రికెటర్లకు దూరంగా ఉండాలని ఆదేశించారు.

Related Post