అవును. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే హోటల్స్, టిఫిన్ సెంటర్స్, స్వీట్స్, బేకరీ ఉత్పత్తులకు ప్రజలు అదనపు ధర చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోని కాస్త పెద్ద హోటల్స్ బిల్లులోనే గ్యాస్ సర్‌ఛార్జ్ 5 శాతం అదనం అంటూ స్పష్టంగా పేర్కొంటున్నాయి. ప్రజలకు కూడా గ్యాస్ ఇబ్బందులు గురించి తెలుసు కనుక మౌనంగా పెంచిన మొత్తం చెల్లిస్తున్నారు.
ప్రస్తుతం వాణిజ్య గ్యాస్ కనెక్షన్ ఉన్న హోటల్స్ సైతం బ్లాకులో కొనుగోలు చేయాల్సివస్తోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,105కాగా డిమాండ్ బట్టి బ్లాకులో ఒక్కో సిలిండర్ రూ. 4,500 నుంచి రూ.5,500 వరకు వసూలు చేస్తున్నారు. ఆ భారాన్ని నేరుగా వినియోగదారులకి ఇలా బదిలీ చేస్తున్నాయి.
కానీ గ్యాస్ ఏజన్సీ ద్వారా బుకింగ్ చేసుకుంటే దొరకని గ్యాస్ సిలిండర్లు బ్లాకులో ఎలా దొరుకుతున్నాయి?అంటే గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్లు పక్కదారి పట్టించి సప్లై చేస్తుండటం వల్లనే.
చిన్నా పెద్ద హోటల్స్ మొదలు రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్స్, బజ్జీలు, సమోసాలు, జిలేబీలు తయారుచేసేవారు వరకు చాలా మంది బహిరంగంగానే గృహవినియోగ సిలిండర్లు వాడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు కదా? అంటే గృహావసరాలకు ఇవ్వాల్సిసిన గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నట్లే కదా?