ప్రాక్టీస్ జరుగుతుండగా ఉప్పల్ స్టేడియంకు పవర్ కట్!

April 05, 2024
img

నేడు హైదరాబాద్‌, ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌, చెన్నై టీమ్స్ మద్య ఐపిఎల్ మ్యాచ్ జరుగబోతోంది. కనుక గురువారం సాయంత్రం రెండు టీమ్స్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్టేడియం నిర్వాహకులు వెంటనే జనరేటర్స్ ఆన్‌ చేసి విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. 

అయితే ట్రాన్స్‌కో అధికారులే నిన్న సాయంత్రం ఉప్పల్ స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపి వేసిన్నట్లు తర్వాత తెలిసింది. ఉప్పల్ స్టేడియంకు రూ.1.67 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించవలసి ఉంది. ఆ బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ ఎన్నిసార్లు నోటీసులు పంపించినా హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పట్టించుకోలేదు.

ఇటీవల కొన్నిసార్లు ఉప్పల్ స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఆ సమయంలో మ్యాచ్‌లు జరగడం లేదు కనుక హెచ్‌సీఏ పట్టించుకోలేదు.

కానీ నేడు ఐపిఎల్ మ్యాచ్ జరుగబోతున్న సమయంలో ట్రాన్స్‌కో అధికారులు స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడమే కాకుండా బకాయిలు చెల్లించకుండా విద్యుత్ వాడుకోవడాన్ని విద్యుత్ చౌర్యమే అని చెపుతూ విద్యుత్ చౌర్యం కేసుని కూడా నమోదు చేశారు. తక్షణం బకాయిలు చెల్లించాలని లేకుంటే ఈరోజు కూడా నిలిపివేసి చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో హెచ్చరించడంతో హెచ్‌సీఏ అప్రమత్తమైంది.

ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు జరుగబోయే ఐపిఎల్ మ్యాచ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టికెట్స్ కూడా అమ్మేశారు. అప్పుడే స్టేడియం వద్ద హడావుడి కూడా మొదలైపోయింది. కనుక హెచ్‌సీఏ ముందు రెండే మార్గాలున్నాయి. వెంటనే విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్దరించుకోవడం. ఏదో ఒకటి చేసి మ్యాచ్ జరిపించక తప్పదు.

Related Post