ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి అమెరికా అధ్యక్షుడు, డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ తప్పుకున్నారు. వృద్ధాప్యం, ఆరోగ్య కారణాలతోనే ఆయన తప్పుకున్నప్పటికీ అమెరికా మళ్ళీ నియంతృత్వ పాలకుల (డొనాల్డ్ ట్రంప్) చేతిలో పడకుండా కాపాడాలనే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష పదవికి అన్నివిధాల అర్హురాలని చెప్పారు. కనుక ఆయన నిర్ణయం కమలా హారిస్‌కు అనూహ్యంగా కలిసి వచ్చింది. అప్పుడే ఆమె డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఇది రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఎందువల్ల అంటే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న జో బైడెన్ ఇంతకాలం పోటీలో ఉండటంతో డొనాల్డ్ ట్రంప్ ప్రతీ చర్చలో ఆయనపై పైచేయి సాధిస్తూ దూసుకుపోతున్నారు. కానీ ఇప్పుడు బైడెన్ స్థానంలో కమలా హారిస్ బరిలో దిగడం, ముఖ్యంగా ఆమె తొలి మహిళా అధ్యక్ష అభ్యర్ధి కావడంతో డొనాల్డ్ ట్రంప్ కంగు తిన్నారు.
ఆమె అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించలేరని, కనుక ఈ పదవికి ఆమె తగరని డొనాల్డ్ ట్రంప్ నోరు జారారు. అది కూడా ఆమెకు ఎన్నికల ప్రచారం బాగా కలిసి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్‌కు మహిళలంటే చాలా చులకన అని మరోసారి నిరూపించుకున్నారంటూ కమలా హారిస్ వాదనలు అమెరికాలో మహిళా ఓటర్లను, ముఖ్యంగా ఇండో అమెరికన్ ఓటర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆమె ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం మూడు రోజులలో 130 మిలియన్ డాలర్లు విరాళాలు సేకరించారు. మహిళల పట్ల చులకనభావం ప్రదర్శించే డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ చేతిలోనే ఓడిపోతారని అంటున్నారు.