ఉప్పల్ స్టేడియంకు ఇక పవర్ కట్స్ ఉండవు

June 19, 2024
img

ఎట్టకేలకు హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు సిద్దపడింది. 2015 నుంచి విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ స్టేట్ స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ (టిఎస్ఎస్పిడిసిఎల్)తో వివాదం ఏర్పడింది. దీంతో విద్యుత్ బకాయిలు రూ.1.64 కోట్లకు చేరుకున్నాయి.

టిఎస్ఎస్పిడిసిఎల్ ఎన్నిసార్లు నోటీసులు పంపినా హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ స్పందించకపోవడంతో ఇటీవల ఐపిఎల్ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి షాక్ ఇచ్చింది. దీంతో అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్శనపల్లి జగన్‌మోహన్ రావు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ఈ సమస్యపై చర్చించారు.

ఈ సమస్యను ఇంకా కొనసాగిస్తే హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ట దెబ్బ తింటుందని, అలాగని మొత్తం బకాయి ఒకేసారి తీర్చలేము కనుక వాయిదాల పద్దతిలో బాకీ తీర్చేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు టిఎస్ఎస్పిడిసిఎల్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఒప్పించి మొదటి వాయిదాగా రూ. 15 లక్షలు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో చెల్లించారు.

కానీ మిగిలిన మొత్తం రూ.1.48,94,521  కోట్లు మంగళవారం ఒకేసారి చెల్లించేశారు. దీంతో ఈ చిరకాల సమస్య పరిష్కారం అయిపోయింది. కనుక ఇకపై ఉప్పల్ స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడదు.  

Related Post