శాసనసభ ఎన్నికలలో మోసం-1, లోక్‌సభ ఎన్నికలలో మోసం-2

April 23, 2024


img

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం చేవెళ్ళ బిఆర్ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కొందరు పిరికి పందలు మేము అధికారం కోల్పోగానే పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ పదవి పొందిన రంజిత్ రెడ్డి, మంత్రి పదవి పొందిన పట్నం మహేందర్ రెడ్డి, ఇప్పుడు పదవులకు ఆశపడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, వారిద్దరికీ ప్రజలే బుద్ధి చెప్పాలి. 

శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మోసం-1తో ప్రజలకు సినిమా చూపించి అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో దాని సీక్వెల్‌గా మోసం-2తో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఆగస్ట్ 15లోగా రైతులకు రూ.2 లక్షల పంట రుణాల మాఫీ చేస్తానని రేవంత్‌ రెడ్డి చేసిన తాజా ప్రకటన అటువంటిదే. ప్రజలను ఒకసారి మోసపోతే మన తప్పు కాదు కానీ పదేపదే కాంగ్రెస్‌ చేతిలో మోసపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. కనుక మళ్ళీ మిమ్మల్ని మాయ మాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. 

 బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్రంలో 93 కులాలను ఏకం చేసి వారి మద్య ఐక్యత సాధించి వారి హక్కులు, అధికారం కోసం నిరంతరంగా పోరాడుతూనే ఉన్నారు. ఇటువంటి మంచి నాయకుడిని ఎన్నుకొని లోక్‌సభకు పంపిస్తే బలహీన వర్గాల సమస్యల గురించి గట్టిగా మాట్లాడుతారు,” అని కేటీఆర్‌ అన్నారు. 


Related Post