కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరికేనా?

May 02, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు నెలన్నర రోజులుగా ఢిల్లీ తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు, ఈరోజు తీర్పు వెలువరించవలసి ఉండగా, ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

ఆమెపై సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేసినందున రెండు కేసులలో ఆమె వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు పెట్టుకున్నారు. మే 6వ తేదీన ఈ రెంటినీ కలిపి తీర్పు చెపుతామని న్యాయమూర్తి కావేరీ బవేజా చెప్పారు.

దీంతో కల్వకుంట్ల కవితకు నిరాశ తప్పలేదు. కనుక మరో నాలుగు రోజులు ఆమె జైల్లోనే ఉండక తప్పదు. ఆ రోజైనా కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తుందో లేదో తెలీదు.

తన కూతురుకి బెయిల్‌ లభించకుండా మోడీ అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ ఆరోపించడం గమనిస్తే, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలు, రాష్ట్ర రాజకీయాల ప్రభావం కూడా ఈ బెయిల్‌ పిటిషన్‌ కేసుపై ఎంతో కొంత ఉందనే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉన్నట్లయితే తెలంగాణలో మారబోయే రాజకీయ పరిణామాలు కల్వకుంట్ల కవిత బెయిల్‌పై కూడా ప్రభావం చూపవచ్చు. 


Related Post