అవును క్రిశాంక్‌ను అరెస్ట్ చేశాము

May 02, 2024


img

బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌, ఉస్మానియా విద్యార్ధి నాగేందర్ ఇద్దరినీ తామే అరెస్ట్ చేశామని చౌటుప్పల్ పోలీసులు ప్రకటించారు. 

వారిద్దరూ ఉస్మానియా యూనివర్సిటీ జారీ చేసిన ఓ సర్క్యులర్‌లో విషయాలను వక్రీకరించి నకిలీ సర్క్యులర్ సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, దాని వలన యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిందని అధికారులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై సెక్షన్స్ 466,468,469,505(1-సి) కింద కేసు నమోదు చేశారు. 

నిన్న వారిద్దరూ కారులో సూర్యాపేటలోని పతంగి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నప్పుడు అక్కడే పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాగు నీటి కష్టాలు, విద్యుత్ కోతలు మొదలైపోయాయని బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీలో ఏటా వేసవి సెలవులకు విద్యార్దులు సొంత ఊర్లకు వెళ్ళిపోతుంటారు కనుక హాస్టల్స్ మూసి వేస్తుంటారు. 

అదేవిదంగా ఈ ఏడాది కూడా వేసవి సెలవులకు హాస్టల్స్ మూసి వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేయగా, దానిని క్రిశాంక్, నాగేందర్ ఇద్దరూ కలిసి వక్రీకరించి యూనివర్సిటీలో కరెంటు, నీళ్ళు లేకపోవడంతో హాస్టల్స్ మూసివేస్తున్నామన్నట్లు మార్చి, ఆ సర్క్యులర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


Related Post