తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఎవరు బాధ్యులు?

May 15, 2024


img

తెలంగాణలో జరిగిన గత రెండు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే, ప్రతీసారి బీజేపీ ఓడిపోయిన్నట్లు కనిపిస్తుంది. కానీ రాష్ట్రంలో క్రమంగా తన బలం పెంచుకుంటూనే ఉందని అర్దమవుతుంది. 

ఉదాహరణకు గత ఎన్నికలలో బీజేపీ 117 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తే (ఘోషామహల్ ) ఒకటే గెలుచుకుంది. ఈసారి 8 సీట్లు పెంచుకుంది. 

అదేవిదంగా 2014 పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీ (సికింద్రాబాద్‌) ఒక్క సీటే గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికలలో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఈసారి జరిగిన ఎన్నికలలో కనీసం 10-12 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అన్ని సీట్లు గెలుచుకోగలిగితే తెలంగాణలో బీజేపీ మరింత బలపడిన్నట్లు స్పష్టం అవుతుంది. 

అయితే తెలంగాణలో మతతత్వ బీజేపీ బలపడటానికి కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలలో ఎవరు బాధ్యులు? అంటే పరస్పరం నిందించుకుంటున్నాయి. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని కేసీఆర్‌ ప్రయత్నించడం వలననే, కాంగ్రెస్‌ స్థానంలోకి బీజేపీ ప్రవేశించి బలపడిందని విశ్లేషకులు ఇదివరకే చెప్పారు. అయితే తెలంగాణలో బీజేపీని అడ్డుకున్నది మేమేనని, కాంగ్రెస్‌ అసమర్దత వలననే తెలంగాణలోకి బీజేపీ ప్రవేశించి బలపడగలుగుతోందని బిఆర్ఎస్ నేతలు వాదిస్తుంటారు. 

అయితే బీజేపీ మాత్రం ఈసారి లోక్‌సభ ఎన్నికలలో 10-12 సీట్లు గెలుచుకుంటే కేసీఆర్‌ సాయంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి వెనకాడకపోవచ్చు. లేదా కేసీఆరే బీజేపీ సాయంతో కూల్చేయవచ్చు. అంటే నేటికీ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకునేందుకు సిద్దంగానే ఉన్నాయని అర్దమవుతోంది.


Related Post