ప్రజలకు ప్రభుత్వానికి మద్య పంచాయితీ ఏర్పడింది

April 25, 2024


img

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ బుధవారం సూర్యపేటలో నిర్వహించిన ఎన్నికల సభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, సిఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరుగుతూ ఈ ప్రభుత్వానికి, ప్రజలకు మద్య పంచాయితీ ఏర్పడిందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ శత్రువువే అని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపిస్తోంది. ఎన్నికలలో అబద్దాలు, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే పచ్చటి తెలంగాణ మళ్ళీ బీడుభూమిలా మారుతోంది. రాష్ట్రంలో మళ్ళీ కరెంట్ కోతలు మొదలయ్యాయి. రైతులకు నీళ్ళు, రైతు బంధు అందడం లేదు. 

ఈ కాంగ్రెస్‌ మంత్రులకు పరిపాలన, నీటి నిర్వహణ చాతకాక నిత్యం నన్ను తిడుతూ సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి తన హోదాని మరిచి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నాడు. నన్ను కేసులలో ఇరికించి జైలుకి పంపిస్తానని, బిఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేస్తానని బెదిరిస్తున్నాడు. కానీ నేను ఈ కేసులు, జైళ్ళకు భయపడే వాడినే అయితే తెలంగాణ ఉద్యమాలు చేసే వాడినా?

నాలుగు నెలల క్రితం వరకు తెలంగాణ ఎలా ఉండేది? ఇంతలోనే ఇలా ఎలా మారిపోయింది? మేము కరెంట్ కష్టాలు, నీళ్ళ కష్టాలు లేకుండా చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే చేతులెత్తేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి మద్య పంచాయితీ ఏర్పడింది. ఈ పంచాయితీని తీర్చగలిగేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే.

కనుక లోక్‌సభ ఎన్నికలలో 12 సీట్లు ఇచ్చి బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మీ అందరి తరపున నిలబడి మేము ప్రభుత్వంతో పోరాదుతాము. ఈ ప్రభుత్వం మెడలు వంచి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాము. నల్గొండ బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.


Related Post