తెలంగాణ పది ఫలితాలు, సప్లిమెంటరీ పరీక్షల తేదీ విడుదల

April 30, 2024
img

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం ప్రకటించారు. ఈసారి ఫలితాలలో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాలలో కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలురు ఉత్తీర్ణత శాతం 89.42కాగా బాలికలు 93.23 శాతం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,927 పాఠశాలలో వందశాతం విద్యార్ధులు ఉత్తీర్ణులు కాగా 6 ప్రైవేట్ పాఠశాలలో ఒక్కరూ కూడా ఉత్తీర్ణులవలేదు.

పది ఫలితాలలో నిర్మల్ జిల్లా 99.09 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలువగా, 98.65 శాతంతో సిద్ధిపేట 2వ స్థానంలో, 98.27 శాతంతో రాజన్న సిరిసిల్లా మూడో స్థానంలో నిలిచాయి. చివరి మూడు స్థానాలలో ఆసిఫాబాద్ (83.29), గద్వాల్ (81.38), వికారాబాద్ (65.10) నిలిచాయి. 

పది ఫలితాలతో పాటు ఈ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్దుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జూన్ 3 నుంచి 13వరకు ప్రతీ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వీటి కోసం మే 16లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

పది ఫలితాలను రీవెరిఫికేషన్, మార్కులు రీకౌంటింగ్ చేసుకోవాలనుకుంటే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.ఈ పరీక్షలు వ్రాయబోయే విద్యార్దులు తమ దరఖాస్తులపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో సంతకం చేయించి, తమ హాల్ టికెట్స్, ఫీజు రశీదు వగైరా జత చేసి డీఈవో కార్యాలయాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది.

పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దరఖాస్తులను స్వీకరించబోమని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్దులందరూ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌తో సంబంధం లేకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావలసి ఉంటుందని అధికారులు చెప్పారు.



Related Post